
వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ భారీ సోదాలు: ఇద్దరు అధికారులు అరెస్ట్!
హనుమకొండ: వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తిష్టవేసిన అవినీతి తిమింగలాల ఆట కట్టించింది ఏసీబీ. రిజిస్ట్రేషన్ల పేరుతో సామాన్యులను పీడిస్తూ, ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.
ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లు
ఈ నెల 2వ తేదీన హనుమకొండ జిల్లాలోని వరంగల్ (R.O) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కార్యాలయంలో అనధికారికంగా తిరుగుతున్న 20 మంది ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లను గుర్తించి, వారి నుంచి రూ. 47,450 నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, సబ్ రిజిస్ట్రార్ల సూచనల మేరకే తాము వినియోగదారుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు.
ఫోన్ గ్యాలరీలో దొరికిన చిట్టా.. బయటపడ్డ అక్రమాస్తులు!
ఈ కేసులో ప్రధాన నిందితుడైన సబ్ రిజిస్ట్రార్-II దావులూరి ఆనంద్ (AO-1) మొబైల్ ఫోన్‌ను పరీక్షించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
కేవలం 8 రోజుల్లోనే రూ. 16,23,000 వసూలు చేసినట్లు ఉన్న చేతిరాత లెక్కల ఫోటోలు ఫోన్ గ్యాలరీలో దొరికాయి.
వాట్సాప్ చాట్లు, ఫోన్‌పే, యూపీఐ లావాదేవీల ద్వారా లంచాల డబ్బులు చేతులు మారినట్లు పక్కా ఆధారాలు లభించాయి.
అక్రమంగా సంపాదించిన సొమ్ముతో హనుమకొండలోని కపిల్ కాకతీయ టవర్స్‌లో తన కుటుంబ సభ్యుల పేరు మీద రూ. 72 లక్షల విలువైన రెండు వాణిజ్య సముదాయాలను (Commercial Spaces) కొనుగోలు చేసినట్లు ఏసీబీ నిర్ధారించింది.
అరెస్ట్ అయిన అధికారులు:
దావులూరి ఆనంద్ (సబ్ రిజిస్ట్రార్-II, వరంగల్) – ఈయనకు సంబంధించి రూ. 44.28 లక్షల అక్రమ లావాదేవీలు గుర్తించారు.
జమాలపురం రమణసింహారావు (సబ్ రిజిస్ట్రార్-I, వరంగల్) – ఈయనకు సంబంధించి రూ. 74 వేల లావాదేవీలు ఉన్నట్లు తేలింది.
కోర్టులో హాజరు
అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వ్యవస్థీకృత అవినీతికి పాల్పడిన ఈ ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
ప్రజలకు ఏసీబీ విన్నపం:
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయండి. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా సమాచారం అందించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
