
కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనలో పలువురు కార్యకర్తలు గాయపడగా, ఆరుగురికి చేతులు విరిగినట్లు పార్టీ నాయకులు ఆరోపించారు.బీజేపీ కార్యకర్తలు 58వ డివిజన్లో బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని లాఠీఛార్జి చేసినట్లు సమాచారం.పోలీసుల దాడి విచక్షణరహితంగా జరిగిందని, తమపై అనవసరంగా బలప్రయోగం చేశారని బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు తెలిసింది.పోలీసుల తీరును నిరసిస్తూ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనతో జిల్లా పరిషత్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
