
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓటు వేసిన బ్యాలెట్ పేపర్..
హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని రెండవ వార్డు, నాలుగవ పోలింగ్ బూత్ (కాకతీయ స్కూల్) కేంద్రం నుంచి ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో మొత్తం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థిగా దున్నపోతుల ఎల్లమ్మ పోటీలో ఉన్నారు. ఆమెకు ఓటు వేయాలని సన్నిహితులు అభ్యర్థించిన నేపథ్యంలో పల్లపు సాయి ఓటు వేశారు. అనంతరం ఆయన వేసిన బ్యాలెట్ పేపర్‌ను తన పరిచయస్తుడు టి. అశోక్‌కు చూపించారు.
ఎన్నికల నిబంధనలు తెలియకపోవడంతో టి. అశోక్ ఆ బ్యాలెట్ పేపర్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వేగంగా వైరల్ అయింది. ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, పోలింగ్ స్టేషన్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ మొబైల్ ఫోన్ ఎలా లోపలికి వెళ్లిందన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఓటు వేసిన అనంతరం బ్యాలెట్ పేపర్‌ను అధికారుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్‌లో వేయాల్సి ఉండగా, ఫోటో తీసుకునే వరకు ఎవరూ గమనించకపోవడం, ఆ ఫోటో బయటకు రావడం వంటి అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలింగ్ బూత్ అధికారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.ఈ ఘటనతో ఎన్నికల నిబంధనల అమలు, పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లపై మళ్లీ చర్చ మొదలైంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
