
చెల్పూరు (జయశంకర్ భూపాలపల్లి జిల్లా):
కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. అలాగే సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఈ అంశాలపై స్పష్టతనిచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమైతే ప్రజలకు ముందుగా తెలియజేసి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తరువాతే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించిన సీఎం, భూపాలపల్లి ప్రజలు చైతన్యవంతులని, కుట్రలు–కుతంత్రాలను గుర్తించే శక్తి వారికి ఉందని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చారు.
సింగరేణి మెడికల్ బోర్డు విషయంలోనూ జరుగుతున్న అపోహలను సీఎం ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు విస్తరించిన సింగరేణి పరీవాహక ప్రాంతంలో వేలాది కార్మిక కుటుంబాలు ఉన్నాయని, వారి ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు. సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదన్నారు.
2027లో నిర్వహించనున్న పుష్కరాలపై మాట్లాడుతూ, గోదావరి పరీవాహక ప్రాంతంలో బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గతేడాది సరస్వతి పుష్కరాలు, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించిన విషయాలను గుర్తుచేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి పనుల కోసం రూ.6,116 కోట్లను కేటాయించామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ–ఉస్మానియా విశ్వవిద్యాలయాల పాత్ర, ప్రొఫెసర్ జయశంకర్ సేవలను సీఎం స్మరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బహిరంగ సభ వేదికపై నుంచి ‘సమ్మక్క–సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్య’కు రూ.205 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు.
