
వే బ్రిడ్జి నిర్వాహకుల లూటీపై రైతుల ఆగ్రహం
50 రూపాయల బదులు 100 రూపాయలు వసూలు
జిందగీ 9 న్యూస్, అక్టోబర్ 27 (వైరా నియోజకవర్గ రిపోర్టర్: రాము)
ఏన్కూరు మండల పరిధిలోని వే బ్రిడ్జి నిర్వాహకుల అధిక వసూళ్లపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వాహనానికి రూ.50 లు మాత్రమే వసూలు చేసేవారు. కానీ ఎటువంటి అధికారిక ఆదేశాలు లేకుండానే ప్రస్తుతం రూ.100 లు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులు మాట్లాడుతూ — “మేము పంట పండించడానికి ఎంత కష్టపడుతున్నామో ప్రభుత్వం కూడా తెలుసు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు అన్నీ పెరిగిపోయాయి. ఇప్పుడు పంటను అమ్మడానికి తీసుకెళ్లినా వే బ్రిడ్జి వద్ద అధిక వసూళ్లు చేస్తున్నారు. ఇది మాకు మరో భారంగా మారింది” అని వాపోతున్నారు.
వే బ్రిడ్జి నిర్వాహకులు రైతుల నిరసనలను పట్టించుకోకుండా “రేట్లు పెరిగాయి” అనే పేరుతో అదనపు వసూళ్లు కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
గ్రామస్థులు స్పందిస్తూ — “ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం మాత్రమే వసూళ్లు జరగాలి. ఎవరికీ అదనపు డబ్బులు వసూలు చేసే అధికారం లేదు. ఇలాంటి దందాలను నిలువరించకపోతే రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారు” అని తెలిపారు.
ఈ అంశంపై వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు తక్షణమే విచారణ జరిపి, రైతులపై జరుగుతున్న లూటీని అరికట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
