
తెలంగాణ ఉద్యమ గాయకుడిగా ప్రసిద్ధి చెందిన నల్గొండ గద్దర్ నరసన్నను కాంగ్రెస్ నేత, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఆదివారం సత్కరించారు. హైదరాబాద్లోని తన స్వగృహానికి ఆహ్వానించి, శాలువా కప్పి ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ – “యువత గంజాయి, మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండేలా పాటల ద్వారా ప్రేరణ కలిగించడంలో నరసన్న పాత్ర ప్రశంసనీయం” అని తెలిపారు. “వద్దురా తమ్మి గంజాయి జోలికి…” అనే పాటను ఉదహరిస్తూ, ఇలాంటి సందేశాత్మక గీతాలను మరిన్ని పాడాలని సూచించారు. యువత చదువులపై దృష్టి పెట్టి, జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించే పాటలు సమాజానికి అవసరమని అభిప్రాయపడ్డారు.
వెలిచాల కుటుంబానికి కళ, సాహిత్యం, కళాకారుల పట్ల అనుబంధం ఉన్నదని గుర్తుచేశారు. ఈ ప్రేమను వెలిచాల జగపతిరావు నుంచి తన కుమారుడు రాజేందర్ రావు కొనసాగిస్తున్నారన్నారు. నరసన్న తమ కుటుంబానికి ఆత్మీయుడని, ఆయన పాటలు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు.
రాజేందర్ రావు చేసిన సత్కారంపై నరసన్న ఆనందం వ్యక్తం చేశారు. “ఇంకా ఎన్నో మంచి సందేశాలిచ్చే పాటలు పాడేందుకు ప్రేరణ లభించిందని” తెలిపారు.
