ప్రతి పదవ తరగతి విద్యార్థి ఇంటర్ పూర్తిచేయాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి
పదవ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తిచేయాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉన్నా, ఇంటర్ పూర్తయ్యే సరికి సంఖ్య తక్కువవడం గమనార్హమని చెప్పారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం, విద్యార్థి జీవితంలో ఇంటర్ దశ కీలకమని పేర్కొన్నారు. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
విద్యా కమిషన్, ఎన్జీవోలు, పౌర సమాజ సూచనలను పరిగణలోకి తీసుకొని ఇంటర్ విద్యను పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. శాసనసభలో కూడా చర్చ పెడతామని చెప్పారు. ఇంటర్లో హాజరు, విద్యార్థుల చేరికలపై దృష్టిపెట్టాలని సూచించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనాలను సీఎం పరిశీలించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ ప్రగతిపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో బాలుర కోసం ఒకటి, బాలికల కోసం ఒకటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. స్థల సేకరణ వేగంగా పూర్తిచేయాలని చెప్పారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ నమూనాను పరిశీలించిన సీఎం, కొన్ని మార్పులు సూచించి టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.

