
జూలూరుపాడు, మే 28 (Zindagi9News – రాము నాయక్) –ఖమ్మం జిల్లా పోలీసులు మరోసారి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మే 27 సాయంత్రం 6:10 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు జూలూరుపాడు పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో భారీగా గంజాయి పట్టుబడింది.
పడమట నరసాపురం గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద జరిగిన తనిఖీలో HR 55 AH 7375 నంబర్ గల ఐచర్ వ్యాన్‌ను ఆపి పరిశీలించగా, దాని వెనుక భాగంలో ప్రత్యేకంగా నిర్మించిన గదిలో 830.540 కిలోల (8 క్వింటాల 30 కిలోల 540 గ్రాముల) నిషేధిత గంజాయి ప్యాకెట్ల రూపంలో దాచినట్లు గుర్తించారు. దీని మార్కెట్ విలువ సుమారుగా రూ. 4.15 కోట్లు.
ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా, మోతగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసిపాక గ్రామం నుండి లోడ్ చేసి, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు వెల్లడించారు.
అరెస్టైన నిందితుల వివరాలు:
A1: జస్రం (41), పూల్ సింగ్ కుమారుడు, వృత్తి: డ్రైవర్, బసవైకాపుర, హతర్ కర్రీ, బెండు జిల్లా, మధ్యప్రదేశ్.
A2: రాంకుమార్ అజారయ్య (46), చేదలాల్ కుమారుడు, వృత్తి: డ్రైవర్, భైర గ్రామం, బెండు జిల్లా, మధ్యప్రదేశ్.
పోలీసులు కేసు నమోదు చేసి, గంజాయి తరలించేందుకు ఉపయోగించిన వ్యాన్‌తో పాటు రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను కోర్టుకు తరలించి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు.
ఈ విజయవంతమైన ఆపరేషన్‌ను నిర్వహించిన జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ భాదవత్ రవి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్ఐలు ప్రవీణ్ తదితర బృందాన్ని ఎస్పీ రోహిత్ రాజ్, ఐపీఎస్ ప్రశంసించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
