కృత్రిమ మేధ(ఏఐ) ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ను సమగ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
బుధవారం జూబ్లీహిల్స్ లో మాడ్యూర్ హాస్పీటల్ సర్వీసెస్ రూపొందించిన ‘ఎండిఆర్.మై డిజి రికార్డ్’ మొబైల్ యాప్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
“ఇటీవలి కాలంలో వ్యాధిగ్రస్తులు ముందుగా ఒక ఆసుపత్రికి వెళ్తున్నారు. అన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. చికిత్స తీసుకుంటున్నారు. నమ్మకం కుదరక మళ్లీ ఇంకో ఆస్పత్రికి వెళ్తున్నారు. అక్కడ కూడా మళ్లీ అన్ని వైద్య పరీక్షలను చేయించుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం లోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వచ్చాకా రోగులపై పడే అదనపు భారం తగ్గుతుంది. వేగంగా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులకు సాయపడుతుంది. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది” అని అన్నారు. “హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. ఏఐ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి,
అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా రూపొందిస్తాం’ అని వివరించారు. ఆరోగ్య సమాచారాన్ని కచ్చితత్వం తో అందించేలా ఏఐ ఆధారిత మోబైల్ యాప్ ను రూపొందించిన మాడ్యూర్ హాస్పీటల్ సర్వీసెస్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య రంగంలో ఇలాంటి తరహా ఆవిష్కరణలు మరిన్ని రావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్, మాడ్యూర్ హస్పిటల్స్ సర్వీసెస్ ఛైర్మన్ మోటూరి కృష్ణప్రసాద్, సీఈవో డాక్టర్ సరోజ్ గుప్తా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాక్టర్ క్రిస్ హాంప్రయ్స్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
