పురుగులతో కూడిన భోజనం… 31 మంది విద్యార్థినులకు అస్వస్థత.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం, కొరికిశాల గ్రామంలోని కస్తుర్బా గాంధీ బాలికల వసతి గృహ పాఠశాలలో ఉదయం అందించిన కిచిడి భోజనంలో పురుగులు రావడంతో మొత్తం 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
వారిలో 16 మంది చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో, 15 మంది మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విద్యార్థినులు బాధపడుతున్నారు.
ఈ విషయం వెలుగులోకి రాకుండా చేయాలని ప్రిన్సిపాల్, వార్డెన్ EMT పథకాన్ని ఉపయోగించి విద్యార్థుల ఆరోగ్యాన్ని తక్కువచేసే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఎమ్మెల్యే పర్యటన ఉండటంతో విద్యార్థుల పరిస్థితిని దాచే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి డ్యూటీ డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ & బీఆర్ఎస్వి నాయకులు విద్యార్థినులను పరామర్శించారు.
ఈ ఘటనపై స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ హాస్పిటల్ ఆవరణలో ధర్నా నిర్వహించారు.
సమాచారాన్ని దాచిన అధికారులపై, ప్రత్యేకించి ప్రిన్సిపాల్, వార్డెన్, కుకింగ్ సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
