శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేష్ కుమార్ ఆవిష్కరణ
కరీంనగర్, మార్చి 10: స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 94వ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో నిఫా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యానికి ప్రాణత్యాగం చేసిన మహానుభావుల త్యాగాలను ఎప్పటికీ మరవలేమన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల వీరోచిత పోరాటం యువతకు ఆదర్శమని, వారి స్ఫూర్తితో సమైక్యత, సాంస్కృతిక సంపదను కాపాడే బాధ్యత యువతపై ఉందని పేర్కొన్నారు.
నిఫా అధ్యక్ష, కార్యదర్శులు కే. యాదవ రాజు, కోలగని శ్రీనివాస్ మాట్లాడుతూ, మార్చి 16 నుండి 23వ తేదీ వరకు భారతదేశంలో 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, 800 జిల్లాలతో పాటు 20 అంతర్జాతీయ దేశాలలో రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ యూత్ ప్రాజెక్ట్, నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ ఆక్టివిటీస్, వివిధ కళాశాలల జాతీయ సేవా పథక (NSS) బాధ్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్స్, వివిధ స్వచ్ఛంద సంఘాలు, యువజన సంఘాల సహకారంతో 150 రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ జె. రవికుమార్, ఓ.ఎస్.డి డి.ఆర్. హరికాంత్, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ గోపికృష్ణ, నిఫా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గొల్లె తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
