
సూర్యాపేటలో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్టు: అవినీతి ఆరోపణలపై ఏసీబీకి చిక్కిన ఇద్దరు పోలీసులు
సూర్యాపేట | మే 12, 2025
సూర్యాపేట జిల్లాలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులపై అవినీతి ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. డివిజన్ డీఎస్పీ కె. పార్థ సారథి, టౌన్ ఎస్హెచ్ఓ (ఇన్స్పెక్టర్) పి. వీర రాఘవులు లంచం డిమాండ్ చేసిన కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల చేతికి చిక్కారు.
స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని బెదిరించి రూ. 25 లక్షలు డిమాండ్ చేసినట్లు, అనంతరం ఆ మొత్తం రూ. 16 లక్షలకు తగ్గించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారుడి సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, సూర్యాపేట డీఎస్పీ కార్యాలయం వద్ద పట్టుబడిన ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ ప్రకారం, ఫిర్యాదుదారుడిపై ఉన్న కేసులో అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసుతోనే వదిలేయాలని, అలాగే అతని స్కానింగ్ సెంటర్‌ను నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ కార్యకలాపాలను కొనసాగించేందుకు అనుమతించేందుకు లంచం తీసుకున్నారని వెల్లడించింది.
ఇంతకుముందు, ఏప్రిల్ 18న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్కానింగ్ సెంటర్‌పై జరిపిన తనిఖీల్లో, యజమాని వద్ద ఎంఢీ (రేడియాలజీ) అర్హతలు లేకుండా నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు, అతని రిజిస్ట్రేషన్ గడువు ముగిసినట్లు బయటపడింది. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇద్దరు అధికారులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
