వీణవంకలో పాత జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల మందుబాబుల అడ్డాగా మార్పు

వీణవంక ప్రతినిధి, ఆగస్టు 23: వీణవంక మండల కేంద్రంలోని పాత జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల చదువుల బడి కంటే మందుబాబుల అడ్డాగా మారి, స్థానికుల ఆగ్రహానికి గురవుతోంది. గేటుకు తాళం వేయకపోవడంతో ఇష్టారాజ్యంగా మద్యం సేవలు, జల్సాలు, దావతులు జరుగుతున్నాయి.
ఈ పాఠశాల ఆవరణలో ప్రస్తుతం గ్రంథాలయం, పి హెచ్ సి సబ్ సెంటర్, మూడు అంగన్వాడీ కేంద్రాలు, నర్సరీ చెట్ల పెంపకం కొనసాగుతున్నాయి. అయితే సాయంత్రం అయ్యిందంటే ఆవరణలో మద్యం పార్టీలే రొజూ సీన్. ఖాళీ బీరు బాటిళ్లు, వాటర్ బాటిళ్లు, ఇస్తారాకులు ఎక్కడికక్కడా కనిపిస్తున్నాయి. తాగుబోతులు గుంపులుగా చేరి సెల్ఫోన్లలో మాట్లాడుతూ, సిగరెట్లు తాగుతూ ఆవరణను అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేస్తున్నారు.

గతంలో పత్రిక కథనాలకు స్పందించిన అధికారులు కొన్ని రోజులు గేటుకు తాళం వేశారు. కానీ మళ్లీ నిర్లక్ష్యంతో గేటు ఓపెన్ చేసి ఉంచడంతో మళ్లీ మందుబాబులకి అడ్డాగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
సరస్వతి మాత విగ్రహం ఉన్న విద్యాలయ ప్రాంగణం ఖాళీ బీరు సీసాలతో వైన్ షాప్లా మారిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక వేత్తలు, పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రముఖులు స్పందించి పాఠశాలకు తాళం వేయాలని, చదువుల బడిని రక్షించాలని అధికారులను కోరుతున్నారు.
