
ఇల్లంతకుంటలో వధువు అనుమానాస్పద మృతి
భర్త, అత్తపై పోలీసులు కేసు నమోదు
ఇల్లంతకుంట, నవంబర్ 3 (జిందగీ 9 న్యూస్):
హన్మకొండ జిల్లా గోపాలపూర్‌కు చెందిన నిమ్మల శివశంకర్ (62, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి) కుమార్తె సాయి సుప్రజ (25) అనుమానాస్పదంగా మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం — సాయి సుప్రజకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 2న ఇల్లంతకుంట గ్రామానికి చెందిన గొడిశాల విక్రమ్ కుమార్ (s/o రాజలింగం)తో వివాహం జరిగింది. పెండ్లి సమయంలో సుప్రజకు అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చే వ్యాధి ఉందని వరపక్షానికి తెలియజేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వివాహ సమయంలో రూ.20 లక్షల నగదు, బంగారం ఇచ్చినట్లు తెలిపారు.
వివాహం అనంతరం నెలరోజులపాటు భార్యాభర్తలు సుఖంగా గడిపారు. ఆ తర్వాత విక్రమ్ కుమార్, అతని తల్లి పుష్ప అదనంగా బంగారం తీసుకురావాలని సుప్రజను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు తండ్రి నిమ్మల శివశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులు తాళలేక దసరా తర్వాత ఒక నెల పాటు సుప్రజ తల్లిదండ్రుల వద్దే ఉండి, తరువాత నచ్చజెప్పి భర్త ఇంటికి వెళ్లిందని తెలిపారు.
నిన్న (నవంబర్ 2) సాయంత్రం 5.50 గంటల సమయంలో విక్రమ్ కుమార్ ఫోన్ చేసి “మీ చెల్లెలు బాత్రూంలో పడిపోయింది, జమ్మికుంట హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నాం” అని తెలిపినట్లు శివశంకర్ చెప్పారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికి సుప్రజ మృతదేహంగా మారి ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కూతురు మరణానికి భర్త విక్రమ్ కుమార్, అత్త పుష్ప బాధ్యులని అనుమానిస్తూ నిమ్మల శివశంకర్ ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని మృతదేహ పరీక్షల కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు.ఈ ఘటనపై ఇల్లంతకుంట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
