మానకొండూర్, మే 3(Zindagi9News):మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం పేద ముస్లింలకు న్యాయం చేసే లక్ష్యంతోనేనని, కొందరు రాజకీయ ప్రేరణతో అపోహలు కలిగించి అనవసర రాద్దాంతం చేస్తున్నారని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు.
శనివారం మానకొండూరులో ఏర్పాటు చేసిన బిజెపి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ —
వక్ఫ్ సవరణ బిల్లుతో మైనారిటీ మహిళలకు హక్కులు, చట్టబద్ధ వారసులకు స్వమాన్యాధికారం లభించేలా మార్పులు తీసుకువచ్చామన్నారు. మైనారిటీలోని అన్ని వర్గాల పేదల అభ్యున్నతి దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు.
ఒకే చట్టం, ఒకే న్యాయం అనే రాజ్యాంగ సూత్రాన్ని పాటించకుండా గతంలో వక్ఫ్ కు ప్రత్యేక హక్కులు కల్పించిన కాంగ్రెస్ పాలనను తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి దేశంలో డిఫెన్స్‌కి 18 లక్షల ఎకరాలు, రైల్వేకి 12 లక్షల ఎకరాలు, కాగా వక్ఫ్ బోర్డు వద్ద 9.4 లక్షల ఎకరాలు ఉన్నాయని వివరించారు.
వక్ఫ్ బోర్డు అధికారం పేరుతో – చట్టబద్ధ డాక్యుమెంట్లను పక్కనబెట్టి, నోటితో చెప్పినా ఆస్తులు తమదేనని ప్రకటించే పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లో వక్ఫ్ బోర్డుకు సూపర్ పవర్స్ ఇచ్చిందని, ఇది కాంగ్రెస్ మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయం ఫలమన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం – 2025 ద్వారా కేంద్రం పారదర్శకత, డిజిటలైజేషన్, అవినీతికి అడ్డుకట్ట వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.
వక్ఫ్ బోర్డులో జరుగుతున్న దోపిడీని అడ్డుకునేందుకు, కబ్జా భూములను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. అలాగే ముస్లిం మహిళలకు బోర్డులో ప్రాతినిధ్యం, కుటుంబ వక్ఫ్లలో వారసత్వ హక్కులు కల్పించామని వివరించారు.
చివరగా, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వ్యవస్థను చట్టబద్ధంగా క్రమబద్ధీకరించడం, పేద ముస్లింలకు న్యాయమైన వాటా లభించేలా చూడడమే మోడీ సర్కార్ ఉద్దేశమని స్పష్టం చేశారు.
