హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, చారగొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డి పాల్గొన్నారు.
విద్యా కమిషన్ ప్రీప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు సిద్ధమైన విషయాన్ని సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి నివేదికలో పేర్కొన్న సిఫార్సులను సమీక్షించి, వాటి అమలుపై చర్యలు తీసుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.
కమిషన్ సభ్యులు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల సమస్యలు ముఖ్యమంత్రికి వివరించారు.
విద్యా రంగాన్ని మెరుగుపరిచే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
