
మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి
మేడారం : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ మేళా అయిన సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కుంభమేళా తరహాలో జరిగే ఈ మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని కోరారు.
మేడారంలో ఆలయ ప్రాంగణ అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించిన సీఎం, సమ్మక్క-సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ నమూనాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీలు దేశానికి మూలవాసులని, వారి సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా రాతి కట్టడాలతో నిర్మాణాలు చేపడతామని, జాతర నాటికి పనులు పూర్తయ్యేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. “ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నాం” అని సీఎం పిలుపునిచ్చారు.
సభలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, గిరిజన ప్రజాప్రతినిధులు, ఆదివాసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
