
జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం –
జూలూరుపాడు మండలంలో రేషన్ కార్డుల జారీపై అధికారుల నిర్లక్ష్యం పేదలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఈ మేరకు భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ ఒక పత్రికా ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తన ప్రకటనలో ఆయన పేర్కొనగా, గత 12 ఏళ్లుగా అనేక పేద కుటుంబాలు ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) లేక ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని లౌకికంగా తీసుకోవడంతో పేదలపై తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అర్హ పేద కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చి, వారిని ఆకలితీరేలా చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, జూలూరుపాడు మండలంలో అధికారులు మాత్రం రేషన్ కార్డుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
మీసేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్లు చేసుకున్న పేదలు రిజల్ట్ కోసం తిరుగుతున్నా, అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని, వారి అభ్యర్థనలను తేలికపట్టేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అధికారుల వైఖరి వల్ల పేదలు మూడు నెలల రేషన్ బియ్యాన్ని కోల్పోనున్న ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో — ఇప్పటికీ రేషన్ కార్డు రాని వారు ఆ రేషన్‌కు నోచుకోలేకపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల వెంటనే మండలంలో ప్రత్యేక వెరిఫికేషన్ నిర్వహించి, అర్హులైన ప్రతి పేదకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూక్యా చరణ్ నాయక్, రాంబాబు నాయక్, అధ్యక్షులు గణేష్ నాయక్, వంశీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
