హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలంటూ మహిళా సాధికారత, వ్యాపార వ్యవస్థాపకత కమిటీ చైర్పర్సన్ బెల్లం మాధవి తెలిపారు. స్వదేశీ మేళా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జరిగిన ‘మహిళా ఆర్థిక స్వాలంబన, అభివృద్ధి’ అంశంపై జరిగిన సెమినార్లో ఆమె ముఖ్య వక్తగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాల్లో పురుషులకు దీటుగా ప్రతిభ చాటుతున్నారని చెప్పారు. చిన్నతరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు స్థాపించి స్వయం ఉపాధితో పాటు ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారత అనేది బాధ్యత తీసుకునే సామర్థ్యమే అని పేర్కొంటూ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో మహిళలు తప్పకుండా పాల్గొనాలని సూచించారు.
అహల్యాబాయి హోల్కర్ సేవలు వెలకట్టలేనివి
ఈ సందర్భంగా కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ ప్రాంత మహిళా ప్రముఖ్ డా. కళ్లెం స్వప్న మాట్లాడుతూ, భారత సంస్కృతికి అహల్యాబాయి హోల్కర్ గొప్ప కృషి చేశారని తెలిపారు. ఆమె పేరిట ‘శ్రీ శక్తి పురస్కారం’ అందజేస్తున్నట్టు గుర్తుచేశారు. పరిపాలనలో అహల్యాబాయి సేవలు, దానధర్మాలు మారుపేరుగా నిలిచాయని, అనేక ధ్వంసమైన దేవాలయాలను పునర్నిర్మించారని చెప్పారు.
వ్యవసాయం సమగ్ర అభివృద్ధికి మూలం
అంతకుముందు పాడిపంట, రైతు ఆర్థిక స్వాలంబన అంశంపై జరిగిన సెమినార్లో ఎన్నారై సామ ఎల్లారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం అనేక రంగాల సమ్మిళితమని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధితో ముడిపడి ఉందని, అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతోందని తెలిపారు. రసాయన వ్యవసాయంపై ఆధారపడే బదులు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఇది నీటి, గాలి నాణ్యతను మెరుగుపరచడంతో పాటు పోషకాహారంతో కూడిన ఆహారం అందించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు.
సమగ్ర వ్యవసాయ విధానాలు రైతులకు అదనపు ఆదాయాన్ని, ఉపాధిని కల్పించవచ్చని, పాడిపశువులు, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, కూరగాయల సాగు వంటి అవకాశాలు రైతులకు అనుకూలమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ్ మంచ్ మహిళా సహా ప్రముఖ్ బల్ల స్వప్న, రాష్ట్ర సేవికా సమితి జిల్లా కార్యవాహిక బూర్ల విజయలక్ష్మి, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ కాచం దీప్తి, కరీంనగర్ డైరీ చైర్మన్, స్వదేశీ మేళా కన్వీనర్ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
