డోన్, నంద్యాల జిల్లా – 25 ఫిబ్రవరి 2025:
నంద్యాల జిల్లా అవుకు మండలం, ఉప్పలపాడు గ్రామంలో భూ సర్వే నిర్వహిస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై విఆర్ఏ తలారి రాముడు (56) మృతి చెందాడు. సోమవారం భూములను కొలిచే ఇనుప పరికరం (రోవర్) పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
30 సంవత్సరాలుగా గ్రామ రెవెన్యూ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న తలారి రాముడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రవి కుమార్, కుమార్తె రాజేశ్వరి జన్మత: వికలాంగులవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.
ఈ ఘటనపై సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డోన్ డివిజన్ నాయకులు టి.రామచంద్రుడు, ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి బి.రామనాయుడు, డోన్ మండల ఉపాధ్యక్షులు శివశంకర వరప్రసాద్, సహాయ కార్యదర్శి రంగయ్య స్పందిస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంగళవారం డోన్ ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి జి.అంజన్ బాబుకు వినతిపత్రం అందజేశారు.
సీఐటీయూ డిమాండ్లు:
▪️మృతుడి కుటుంబంలోని ఒకరికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
▪️50 లక్షల నష్టపరిహారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలి.
▪️విద్యుత్ తీగలు నిర్లక్ష్యంగా వేలాడదీయడమే ప్రమాదానికి కారణం కాబట్టి, సంబంధిత అధికారులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో డోన్, ప్యాపిలి విఆర్ఎలు రవికుమార్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
