
తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ TLIPCL ఎండీకి సంపూర్ణ మద్దతు
తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ (TLIPCL) ఎండీ శ్రీనివాస్ నాయక్‌పై జరుగుతున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ లెదర్ పార్క్ సాధన అండ్ చర్మకారుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ప్రకటించింది. ఎండీ శ్రీనివాస్ నాయక్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారనే కారణంతో కొందరు వ్యక్తులు కక్షపూరితంగా, చైర్మన్ లేదా డైరెక్టర్ పదవుల ఆశతో సంఘాల పేర్లతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆ సంఘం ఆరోపించింది.
ప్రభుత్వం నుంచి బడ్జెట్ మంజూరు కాకపోవడం వల్లే నిధులు అందలేదని, అందులో ఎండీ పాత్ర ఏమీలేదని స్పష్టం చేసింది. నిధులు మంజూరు చేయాల్సింది ప్రభుత్వమే తప్ప ఎండీ కాదని పేర్కొంది. ఇప్పటివరకు లెదర్ పార్క్ భూముల విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లేవని తెలిపింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎండీపై తప్పుడు ఆరోపణలు చేయడం అనవసరమని, సంఘాల నాయకులు ముఖ్యమంత్రి, మంత్రుల వద్దకు వెళ్లి నిధుల మంజూరుకు పోరాటం చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో జమ్మికుంటలో సంఘం అధ్యక్షుడు మోత స్వామి ఆధ్వర్యంలో ఎండీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మారపల్లి పోశెట్టి, ప్రధాన కార్యదర్శి మారుమూల లక్ష్మయ్యతో పాటు శీను రాజయ్య, గడ్డం సుదర్శన్, వంతడుపుల కొమరయ్య, శనగరం శ్రీనివాస్, ఇమ్మడి రాజు, యేసయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
