జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు
20 గుంటల స్థలం కేటాయించేలా కృషి చేస్తాం..
మానేరు రివర్ ఫ్రంట్ కు జగపతిరావు పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడుతాం..
ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ
వినతి పత్రాలు అందజేసిన వెలిచాల సాధన సమితి ప్రతినిధులు
పీపుల్స్ లీడర్, గొప్ప నేత కరీంనగర్ టైగర్, మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ వెలిచాల జగపతిరావు చేసిన సేవలను ప్రజలు స్మరించుకునేలా కరీంనగర్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేసేందుకు 20 గుంటల స్థలం కేటాయించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు.
కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ కు జగపతిరావు పేరు పెట్టాలని, అదేవిధంగా ఆయన విగ్రహం ఏర్పాటుకు 20 గుంటల స్థలం కేటాయించాలని కోరుతూ మంగళవారం ధర్మపురి, పెద్దపల్లి, కరీంనగర్లో ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, విజయ రమణారావు, మేడిపల్లి సత్యంకు వెలిచాల సాధన సమితి ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. అలాగే హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితెల ప్రణవ్ బాబుకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, విజయ రమణారావు, మేడిపల్లి సత్యం మాట్లాడుతూ జగపతి రావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు కరీంనగర్లో 20 గుంటల స్థలం కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్ కు జగపతిరావు పేరు పెట్టేలా కృషి చేస్తామని, దీనిపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చిస్తామని తెలిపారు. వారి అనుమతి తీసుకొని మానేరు రివర్ ఫ్రంట్ కు జగపతిరావు పేరు పెట్టేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలు అమలయ్యేలా ప్రత్యేక చొరవ చూపుతామని చెప్పారు. జగపతిరావు అంటే తమకు ఎంతో ప్రేమ అభిమానమని, కాంగ్రెస్ పార్టీలో ఎంతో మందిని నేతలుగా తీర్చిదిద్దిన ఘనత జగపతిరావుకే దక్కుతుందని పేర్కొన్నారు. జగపతిరావు వేలాది మందికి పేదలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి రికార్డు సృష్టించారని తెలిపారు. ఈ తరం యువతకు జగపతిరావు మార్గదర్శకంగా నిలుస్తారని, ఆయన అనుసరించిన మార్గం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జగపతిరావు చేపట్టిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ మర్చి పోలేకపోతున్నారని, జగపతిరావు పేరు చిరకాలం ప్రజల మదిలోనే ఉన్నదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అంతటి ఘనత వహించిన జగపతిరావుకు సముచిత గౌరవం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో పట్టుదలతో ముందుకు వెళ్తామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. 
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనేక మందికి రాజకీయ ఓనమాలు జగపతిరావు నేర్పారని పేర్కొన్నారు. రాజకీయంలో ఎదిగేందుకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అంతటి గొప్ప చరిత్ర కలిగిన జగపతి రావు పేరును మానేరు రివర్ ఫ్రంట్ కు పెట్టేలా కృషి చేస్తానని, ఆయన విగ్రహం ఏర్పాటు కోసం 20 గుంటల స్థలం కేటాయించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ రెండు అంశాలు అమలయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలోవెలిచాల సాధన సమితి కన్వీనర్ సరిల్ల రతన్ రాజు, కో కన్వీనర్ గండి రాజేశ్వర్, అడ్వైజర్లు దర్శనాల నారాయణ, ఎండీ ఖషిద్, పులి నరసింహారావు, డైరెక్టర్ చిందం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
