కృత్రిమ మేధస్సు (AI) వాడుతున్న కాలంలో కూడా వీడని మూఢనమ్మకాలు
జమ్మికుంట, మార్చి 13: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు మాత్రం సమాజాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. జమ్మికుంట పట్టణంలో సోమవారం రాత్రి ఓ కిరాణా షాప్ ముందు గుర్తు తెలియని వ్యక్తులు కోడిని బలి ఇచ్చి, అక్కడే కోడిగుడ్డు, కుంకుమ లాంటి వస్తువులను ఉంచడం సంచలనంగా మారింది.
మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టిన, అంతరిక్షంలో రాకెట్లు ప్రయోగించిన, కృత్రిమ మేధస్సు (AI) వాడుతూ కొత్త ప్రపంచాన్ని అన్వేషిస్తున్న ఈ ఆధునిక యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాల నుంచి పూర్తిగా బయటపడలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
విజ్ఞానం మరియు తార్కికత ఆధారంగా ముందుకు సాగాల్సిన సమాజం, ఇంకా అసత్య నమ్మకాలను కొనసాగించడం బాధాకరం. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఇలాంటి చర్యలను నమ్మడం సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు మరింత చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
