ఓ తండ్రిగా, అన్నగా.. అర్ధరాత్రి ప్రయాణంలో ఆటో డ్రైవర్ ఆత్మీయత

బెంగళూరులో ఆటో డ్రైవర్ ఆత్మీయత.. మహిళల భద్రతపై వైరల్ సందేశం
బెంగళూరు: బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అర్ధరాత్రి రాపిడో ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ, డ్రైవర్ చూపిన ఆత్మీయత వల్ల తాను పూర్తిగా భద్రంగా ఉన్నానని వీడియో ద్వారా వెల్లడించింది.
ఆటోలో అతికించిన చేతిరాత నోటీసును ఆమె వీడియోలో చూపించింది. అందులో, “నేను కూడా ఓ తండ్రిని, ఓ అన్నను. మీ భద్రతే నాకు ముఖ్యం. సౌకర్యంగా కూర్చోండి” అని రాసి ఉండటం అందరి హృదయాలను ఆకట్టుకుంది.
ఈ సందేశం మహిళల భద్రతపై సానుకూల చర్చకు దారితీయడంతో పాటు, ఆ ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల నుంచి విస్తృత ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న మాటలతోనూ ఎంత పెద్ద భరోసా కల్పించవచ్చో ఈ ఘటన చూపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
