
పెబ్బేరు : శ్రీశైలం ప్రాజెక్టు నీటింపుతో నిర్వాసితుడైన గుమ్మడం గ్రామానికి చెందిన సురగౌని రాఘవేందర్ గౌడ్ (45) ఉద్యోగం కోసం ఏళ్లుగా పోరాటం చేసి చివరికి న్యాయం అందకుండానే కన్నుమూశాడు. నియామకానికి సంబంధించి తలుపులన్నీ తట్టిన రాఘవేందర్, పలువురు రాజకీయ నాయకులను కలిశాడు, అధికారులను విన్నవించుకున్నాడు. కానీ, ఉద్యోగం మాత్రం కరవైంది.
ఈ పోరాటంలో ఆరోగ్యం బాగా క్షీణించి, చివరికి నిరుద్యోగ నిర్వాసితుడిగా ప్రాణాలు విడిచిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు గత 40 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ప్రభుత్వాలు, అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర నిరాశతో జీవిస్తున్న పరిస్థితి తెలిసిందే. తాజాగా రాఘవేందర్ మృతితో నిర్వాసితుల్లో ఆవేదన మరింత పెరిగింది.
ఈ వార్త తెలిసిన ఉమ్మడి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల నాయకులు డాగోజీరావు ఆధ్వర్యంలో నిర్వాసితుల సంఘ సభ్యులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక, మానసికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –
“జీవో 98 ప్రకారం ఉద్యోగాలు పొందే వరకు ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం కొనసాగుతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాగోజీరావుతో పాటు గోవిందు, పురుషోత్తం, శ్రీనివాస్ గౌడ్, రామన్ గౌడ్, జల్లి సుధాకర్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
