
ఆరు గ్యారంటీల లాగే బీసీ రిజర్వేషన్ల డ్రామా – హరీశ్ రావు విమర్శ
హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్టులో, “ఆరు గ్యారెంటీల లాగే ఇది కూడా ఒక డ్రామా మాత్రమే. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎప్పుడైనా బీసీల కోసం పోరాడిందా?” అని ప్రశ్నించారు.
హరీశ్ రావు తెలిపారు — “చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వేదికగా పోరాటం చేయండి. మీ జాతీయ నాయకులతో కలిసి పార్లమెంట్లో చట్టం చేయించి షెడ్యూల్–9లో చేర్చండి. బీసీలకు నిజమైన న్యాయం చేయాలంటే అక్కడే యుద్ధ భేరి మోగించండి. ఢిల్లీలో పోరాడాల్సిన వారు, గల్లీలో డ్రామా చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని అమలు చేయకపోగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జీవో జారీ చేసి కొత్త నాటకం ఆడుతున్నారని ఆయన విమర్శించారు. “బీసీల పట్ల ప్రేమ ఉంటే మాటల్లో కాదు, చట్టపరంగా నిరూపించండి. బీఆర్ఎస్ ఎప్పటికీ బీసీలతో ఉంటుంది” అని హరీశ్ రావు ట్వీట్లో పేర్కొన్నారు.
