అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మహిళా సాధికారితపై కీలక అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మహిళలు కుటుంబ పాలన మాత్రమే కాకుండా అన్ని రంగాలలో విశేష ప్రగతిని సాధిస్తున్నారు. సమాజ పురోగతికి మహిళల సహకారం అనివార్యం. ప్రతి పురుష విజయంలో స్త్రీ పాత్ర ఎంతో ప్రాధాన్యమైనది” అని పేర్కొన్నారు.

నేటి పోటీ ప్రపంచంలో మహిళలు తమ ఆత్మవిశ్వాసంతో పురుషులకు సమానంగా ముందుకు సాగి, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వంటగదికి మాత్రమే పరిమితం కాకుండా, మహిళలు విజ్ఞానం, విజయం, సాహసానికి ప్రతీకలుగా మారుతున్నారని తెలిపారు.

వేడుకలలో భాగంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. “మహిళ మేలుకో – సమాజాన్ని ఏలుకో”, “స్త్రీ శక్తి – అనంతమైన శక్తి” వంటి నృత్యాలు, వినోదాత్మక ప్రదర్శనలు మహిళా సాధికారితను చాటిచెప్పాయి.

అంతేకాక, మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, విద్యారంగంలో వారు అందిస్తున్న సేవలను డా. నరేందర్ రెడ్డి అభినందించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న వివిధ క్రీడా పోటీలు వేడుకలకు మరింత ఆనందాన్ని తెచ్చాయి.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
