అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థినికి నాట్య భారతి జాతీయ అవార్డు

అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన ఐదవ తరగతి విద్యార్థిని శాన్విక సాయి ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన నాట్య సింధూరం సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో నాట్య భారతి జాతీయ అవార్డును అందుకుంది. ఈ అవార్డుతో పాటు పతకం, సర్టిఫికేట్, ట్రోఫీని విద్యార్థినికి అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక అభినందన సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని, వాటి ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని సూచించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే విభిన్న కళలపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
