కరీంనగర్ -నిజామాబాద్ -మెదక్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్పోర్స్ విద్యా సంస్థల అధినేత వూట్కూరి నరేందర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ఎస్.సి, ఎస్.టి ఉపాధ్యాయ సంఘం (TSCSTUS) ప్రకటించింది.
తెలంగాణ ఎస్.సి, ఎస్.టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు కిషన్ నాయక్ మాట్లాడుతూ, ఎస్.సి, ఎస్.టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం, రిజర్వేషన్ పెంపు, నిరుద్యోగ యువకులకు శిక్షణా కేంద్రాల ఏర్పాటుపై నరేందర్ రెడ్డి హామీ ఇవ్వడం ప్రశంసనీయం అని తెలిపారు. ఎస్.సిలకు 18% రిజర్వేషన్, ఎస్.టిలకు 10% రిజర్వేషన్ ఉన్నట్లుగా ప్రభుత్వం కార్యరూపం దాల్చేలా కృషి చేస్తానని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి, TSCSTUS అతనికి పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిమల్ల చిట్టిబాబు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ నిధులను ఎస్.సి, ఎస్.టి వర్గాల అభివృద్ధికి వినియోగిస్తానన్న నరేందర్ రెడ్డి హామీ హర్షణీయమైనది అని అన్నారు.
సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ, నరేందర్ రెడ్డి విద్యాసంస్థల్లో ఎందరో ఎస్.సి, ఎస్.టి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, స్థిరపడ్డారు అని గుర్తు చేశారు. అలాంటి విద్యావేత్త లీడర్‌గా ఉంటే ఎస్.సి, ఎస్.టి వర్గాల అభివృద్ధికి మరింత మంచిదని అభిప్రాయపడ్డారు.
అందుకే ఎస్.సి, ఎస్.టి వర్గాలకు చెందిన ఉద్యోగులు, పట్టభద్రులు నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఎస్.సి, ఎస్.టి ఉపాధ్యాయ సంఘం సభ్యులు జి. శంకర్, బి. రాజు తదితరులు పాల్గొన్నారు.
– Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
