అంబులెన్స్ లేకపోవడంతో మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించిన పోలీసులు

నారాయణపేట : నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో అంబులెన్స్ లేకపోవడం దారుణానికి దారితీసింది. బైక్పై బస్టాండ్ వైపు వెళ్తున్న మొగులయ్య (28) అనే వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు సదుపాయం లేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇక చివరికి అక్కడే సంతలో నిమ్మకాయలు అమ్ముతున్న ఓ చిన్న వ్యాపారికి చెందిన తోపుడు బండిని పోలీసులు తీసుకొని మొగులయ్య మృతదేహాన్ని తరలించారు. ఈ దృశ్యం చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అంబులెన్స్ సదుపాయం లేకపోవడం ఎంత దారుణం!” అంటూ విస్మయానికి గురయ్యారు.
ఈ ఘటనతో పోలీసుల వైఖరిపై స్థానికుల మధ్య చర్చలు ముదురుతున్నాయి.
