కరీంనగర్: సోషల్ మీడియా ద్వారా జాతీయవాదాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం మరింత పెరిగిందని ప్రముఖ యూట్యూబర్, జర్నలిస్ట్ నవత దేశ్ పాండే అభిప్రాయపడ్డారు. సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పాండురంగ ఫంక్షన్ హాల్ లో జరిగిన సోషల్ మీడియా సంగమం కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా “భారతీయ సమాజంలో స్త్రీ” అనే అంశంపై మాట్లాడిన నవత దేశ్ పాండే, హిందూ ధర్మంలోనే మహిళలకు గౌరవం ఉన్నట్టు వివరించారు. భారతీయ సంస్కృతిపై సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రతి మహిళ ‘వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి’ లాగా ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా సవ్యంగా వాడాలి – ప్రదీప్ కుమార్
సమాచార భారతి సంయుక్త కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, సోషల్ మీడియా యాక్టివిస్టుల నెట్వర్కింగ్, ట్రెండ్ సెట్టింగ్ లక్ష్యంగా ఈ సంగమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య కథనాలను నిజమైన సమాచారం ద్వారా తిప్పికొట్టడానికి కంటెంట్ క్రియేటర్లు ముందుకు రావాలన్నారు.
“సమాజంపై ప్రభావం చూపే విధంగా కంటెంట్ తయారు చేసి, ప్రధాన స్రవంతి మీడియాను సైతం ప్రభావితం చేసేలా పని చేయాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో తడిగొప్పుల శంకరయ్య, పురాణం రాము, గీకూరి శ్రీనివాస్, సామల కిరణ్, కట్టా వేణుగోపాల్, ఎలగందుల సత్యనారాయణ, విమల్, బాలరాజు తదితరులతో పాటు అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు, బాధ్యులు పాల్గొన్నారు.
