సామాజిక సేవలో ఆదర్శప్రాయం – మానవ విలువల పరిరక్షణ సంస్థ ఘన సత్కారం
రాంపూర్: పట్టణానికి చెందిన సామాజికవేత్త అరుకాల రవీందర్, TGSRTC కండక్టర్ గా పనిచేస్తూ తన సేవా కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ ఆయనను జాతీయస్థాయి ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపిక చేసి, ఆదివారం రాంపూర్‌లోని న్యూ శ్రీనగర్ కాలనీలో ఘనంగా సత్కరించింది.
ఈ పురస్కారాన్ని ఆధ్యాత్మిక గురువు, తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ అందజేశారు. రవీందర్ సేవలను గుర్తించి పట్టు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ,”సామాజికవేత్తగా అన్యాయాన్ని సహించకుండా ధైర్యంగా నిలబడే రవీందర్, నిజాయితీ, నిస్వార్థ సేవా భావంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆర్టీసీ కండక్టర్‌గా తన వృత్తి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటు, సామాజిక సేవలో అపూర్వమైన కృషి చేశారు” అని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి గుండా శ్రీపాల్ గౌడ్, సభ్యులు దేశబోయిన రవీందర్, సురేందర్, శంకర్, కోటి భూమయ్య, విశ్రాంత ఉద్యోగులు, విద్యావేత్తలు, పలువురు ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
