
శ్రామిక ఆటోనగర్ వెల్ఫేర్ సొసైటీకి 10 లక్షల నిధులు మంజూరు
జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శ్రామిక ఆటోనగర్ వెల్ఫేర్ సొసైటీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద 10 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు ప్రతిపాదనపై ఈ నిధులు కేటాయించబడ్డాయి.
సొసైటీ అధ్యక్షులు పరాంకుశం కృష్ణస్వామి మాట్లాడుతూ— “మా ఆటోనగర్ సొసైటీకి నిధులు కేటాయించాలని మనవి చేయగానే వెంటనే స్పందించి, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కమిటీ హాల్ నిర్మాణానికి 3 లక్షలు, కోరపల్లి రోడ్డు నుండి ఆటోనగర్ వరకు సిసి రోడ్డుకు 7 లక్షలు కేటాయించడం జరిగిందని” తెలిపారు.
ఈ సహకారానికి ప్రణవ్ బాబుతో పాటు జిల్లా మంత్రులకు సొసైటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శేషం శ్రీనివాస్, కోశాధికారి పంతాటి రవీందర్, నాయకులు వీణవంక రామలింగ చారి, రాజ కొమురయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
