
వీణవంక మండలంలో విషాదం: తాటి చెట్టుపై నుండి జారిపడి గీత కార్మికుడు మృతి
వీణవంక , ఫిబ్రవరి 14: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గీత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి జారిపడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఘటన వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన గట్టు అయిలయ్య (50) ప్రతిరోజూ లాగే శనివారం తాటి చెట్లు గీసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చెట్టుపై పని చేస్తుండగా అకస్మాత్తుగా పట్టు తప్పి కింద పడిపోయారు. తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.మృతుడి పెద్ద కుమారుడు శ్రీకాంత్ అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయిలయ్య మృతి పట్ల గ్రామస్తులు, తోటి గీత కార్మికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
