హన్మకొండ:వ్యవసాయ రంగంలో రైతువ్యతిరేక సంస్కరణలు తీసుకువస్తూ, దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలను దేశ రైతాంగం ఐక్యంగా ప్రతిఘటించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కె.ఎస్) వరంగల్- హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి పిలుపునిచ్చారు.
ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) దేశవ్యాప్త నిరసన కార్యక్రమం పిలుపులో భాగంగా హన్మకొండ బస్టాండ్ సెంటర్ లో ఏ.ఐ.యు.కే.ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా చిర్ర సూరి మాట్లాడుతూ దేశ వ్యవసాయ రంగాన్ని, కార్యకలాపాలను ప్రైవేట్ కార్పొరేట్ మల్టీ నేషనల్ కంపెనీలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా
వ్యవసాయ మార్కెట్ జాతీయ విధాన ముసాయిదాను విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశ వ్యవసాయ రంగానికి చాలా ప్రమాదకరమని, రైతుల యొక్క భూమిని, పంటను మరియు స్వేచ్ఛ మార్కెట్లను అన్నింటిని దూరం చేసి, కార్పొరేట్ కబంధహస్తాల్లోకి అప్పగించే చర్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ రైతు వ్యతిరేక ముసాయిదాను వెంటనే మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం 60 రోజులుగా పంజాబ్ రైతు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చేస్తున్న నిరాహార దీక్షను విరమింప చేసే చర్యలు మోడీ ప్రభుత్వం చేపట్టాలని కోరారు.
మోడీ ప్రభుత్వం సబ్కా సాథ్, సబ్కా వికాస్, అంటూ చేసే ప్రచారం దేశంలోని కార్పొరేట్ పెట్టుబడిదారులకు మాత్రమే వర్తిస్తున్నదని, కార్మిక, కర్షకుల సంక్షేమాన్ని, ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
మోడీ ప్రభుత్వం దేశ రైతంగానికి గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర చట్టం తీసుకురావాలని, వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిషన్ సూచనలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
లేకపోతే దేశంలోని రైతులందరినీ ఐక్యం చేసి మరోసారి ఢిల్లీని దిగ్బంధిస్తామని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్) జిల్లా కోశాధికారి మైదం పాణి, టి.యు.సి.ఐ. జిల్లా నాయకులు అర్షం అశోక్, పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు
బి.నరసింహారావు, రైతు సంఘం జిల్లా నాయకులు రామచంద్రు, లక్ష్మక్క, సుగుణ, యాకలక్ష్మి, ఎల్లమ్మ, కుమారస్వామి, సతీష్, సుధాకర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
