బోయినిపల్లి ఫిబ్రవరి 25
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ లోని శ్రీ శ్రీ శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబయింది. ఈనెల 26 నుండి 28 వరకు జరిగే మహాశివరాత్రి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు,త్రాగునీరు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గణపతి మాట్లాడుతూ: శివరాత్రి వేడుకలు మూడు రోజులు జరగనున్నట్లు తెలిపారు. ఈనెల 26 శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అభిషేకములు, అర్చనలు, కోడెలు కట్టుట నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి 11:30 కు లింగోద్భావ సమయంలో స్వామివారికి లఘున్యాస పూర్వక రుద్రాభిషేకము నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం రోజున సంగమేశ్వర స్వామి కళ్యాణంతో పాటు అన్నపూజ సాయంత్రం రథోత్సవం మహాలింగార్చన జరుపనున్నట్లు తెలిపారు. శుక్రవారం మహా యజ్ఞంతో కార్యక్రమాలు పూర్తయితయని తెలిపారు. కల్యాణోత్సవం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
