హైదరాబాద్:రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు, భూ లావాదేవీల సమాచారం రైతులకు మరియు ప్రజలకు సులభంగా అందించేందుకు రూపొందించిన భూ భారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఏప్రిల్ 14, సోమవారం ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా భూ భారతి పోర్టల్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం, పలు కీలక సూచనలు చేశారు.
భూ భారతి పై ముఖ్యమంత్రి సూచనలు:
🔸ఈ పోర్టల్ పై పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలోని మూడు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుల ద్వారా భూ భారతి ప్రయోజనాలు, ఉపయోగాలు రైతులకు, ప్రజలకు వివరించాలి.
🔸పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఇదే తరహాలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
🔸భూ భారతి పోర్టల్‌ను సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో అందించాలి. ప్రజల అభిప్రాయాల ఆధారంగా అందులో అవసరమైన మార్పులు చేస్తూ అప్డేట్ చేయాలి.
🔸సాంకేతికంగా బలమైన వెబ్సైట్, మొబైల్ యాప్ రూపంలో భూ భారతి సేవలను అందుబాటులోకి తీసుకురావాలి.
ప్రజలకు సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా భూ భారతి రూపొందించబడిందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని నిరంతరం మెరుగుపరచాలని ముఖ్యమంత్రి స్పష్టంగా సూచించారు.
భూ సమస్యల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, రైతులకు భద్రత, న్యాయం అందించే దిశగా భూ భారతి కీలకపాత్ర పోషించనుంది.
