
జూలూరుపాడు, మే 25 (Zindagi9News ప్రతినిధి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిధుల కేటాయింపు లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు పూర్తి కాలేక పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్లు అందించినప్పటికీ, వాటికి డీజిల్ పోయించేందుకు అవసరమైన నిధులు లేకుండా అధికారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు, కార్మికులు తమ సేవలు నిర్విరామంగా అందిస్తున్నప్పటికీ, వారికి వేతనాలు అందక తీవ్ర సమస్యలతో ఎదురుకుంటున్నారని తెలిపారు.
ఇది మాత్రమే కాక, పంచాయతీల్లో సైడ్ డ్రైనేజీల నిర్మాణం, మొక్కల నాటింపు, బ్లీచింగ్ పౌడర్ చల్లింపు వంటి ప్రాథమిక పనులు కూడా నిధుల లేకపోవడంతో నిలిచిపోయాయని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైన ఈ సమయంలో ఈ పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు అవసరమైన నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ చౌహాన్, వైరా ఇంచార్జ్ రాంబాబు నాయక్, సేవియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
