
నీటిపాలైన రైతు కష్టం – ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలి
సింగరేణి, అక్టోబర్ 31 (వైరా నియోజకవర్గ జిందగీ 9న్యూస్ రిపోర్టర్: రాము) :
సింగరేణి మండలం సూర్య తండాలో అకాల వర్షాలతో నేలమట్టమైన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రవతి, బాధిత రైతులను పరామర్శించారు. అకాల వర్షాల వల్ల పూర్తిగా పాడైన పంటలను చూసి ఆమె రైతులతో మమేకమయ్యారు. చేతికొచ్చిన పంట కళ్లముందే నీటిపాలైపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా డా. చంద్రవతి మాట్లాడుతూ – “ప్రకృతి వైపరీత్యం రైతుల జీవితాలను కుదిపేసింది. వారు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట ఇలా నాశనం కావడం హృదయ విదారకం. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలి. వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలి,” అని డిమాండ్ చేశారు.
రైతులు అధైర్యపడవద్దని, వారికోసం తాను నిరంతరం పోరాడుతానని హామీ ఇస్తూ ఆమె భరోసా కల్పించారు.
