
జమ్మికుంట, మార్చి 7 (zindagi9news): కస్టమర్ల రూపంలో వచ్చి నమ్మబలికారు.. పాత బంగారం ఇచ్చి కొత్త నగలు మార్చుకుంటామని నమ్మించారు.. తీరా వారు వెళ్ళిపోయాక చూస్తే అది నకిలీ బంగారమని తేలింది. జమ్మికుంట పట్టణంలో చోటుచేసుకున్న ఈ మోసం స్థానిక వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణానికి చెందిన విజయగిరి యాదగిరి, పట్టణంలో ‘విజయగిరి యాదగిరి జువెలర్స్’ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఒక మహిళ, ఒక పురుషుడు కస్టమర్ల వేషంలో దుకాణానికి వచ్చారు.
తమ వద్ద ఉన్న ఒక గోల్డ్ బ్రాస్లెట్, చైన్‌ను చూపించి, వాటిని ఎక్స్చేంజ్ (మార్పిడి) చేసి కొత్త నగలు కావాలని కోరారు. వారు తెచ్చిన నగలను చూసి నమ్మి, వాటికి బదులుగా 23.8 గ్రాముల బరువున్న కొత్త బంగారు నగలను వారికి అందజేశారు.వెళ్ళిపోయాక అసలు రంగు బయటపడింది:సదరు వ్యక్తులు దుకాణం నుండి వెళ్ళిపోయిన తర్వాత, వారు ఇచ్చిన నగలను నిశితంగా పరిశీలించగా, అవి నకిలీ బంగారం (రోల్డ్ గోల్డ్) అని గుర్తించి ఖంగుతిన్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. నిందితులు తీసుకెళ్లిన బంగారం విలువ సుమారు రూ.70,000 ఉంటుందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దుకాణంలోని సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో బంగారం లావాదేవీలు జరిపేటప్పుడు వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
