
జమ్మికుంట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో నిర్వహించిన 69వ ఎస్జిఎఫ్ క్రీడా పోటీలు మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగి శుక్రవారం ముగిశాయి. ఎంఈఓ హేమలత ఆధ్వర్యంలో జరిగిన క్లోజింగ్ సెర్మనీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐ రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.
ఈ పోటీల్లో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్-14 వాలీబాల్లో జడ్పిహెచ్ఎస్ కోరపల్లి, అండర్-17 వాలీబాల్లో జడ్పిహెచ్ఎస్ బాయ్స్, ఖో-ఖోలో సోషల్ వెల్ఫేర్ జట్లు విజేతలుగా నిలిచాయి. కబడ్డీలో అండర్-14 విభాగంలో సెయింట్ థామస్, అండర్-17లో విద్యోదయ ప్రథమ స్థానాలు సాధించాయి. విజేత విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్టు మండల ఎస్జిఎఫ్ కార్యదర్శి శ్రీలత తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీటీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.
