
కరీంనగర్లో అమానవీయ ఘటన: ఏడు రోజుల శిశువును రూ.6 లక్షలకు విక్రయించిన యువతి
కరీంనగర్: జిల్లాలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన సంచలనం రేపుతోంది. ప్రేమించిన యువకుడు మోసం చేశాడన్న కారణంతో, పోషణ చేయలేనన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఏడురోజుల బిడ్డను యువతి విక్రయించడం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్కు చెందిన ఆ యువతిని ప్రేమించానని చెప్పి మోసం చేసిన యువకుడిపై తీవ్ర నిరాశకు గురైన ఆమెకు శిశువు పుట్టిన తర్వాత పోషించే పరిస్థితి లేకపోవడంతో విక్రయించాలని నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రక్రియలో మొత్తం 12 మంది మధ్యవర్తులు చేరిన విషయం విచారణలో బయటపడింది.
శిశువును కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లె గ్రామానికి చెందిన బామండ్ల రాయమల్లు, లత దంపతులకు రూ.6 లక్షలకు విక్రయించినట్లు అధికారులు నిర్ధారించారు.
బాలల పరిరక్షణ కమిటీకి సమాచారం అందడంతో వారు వెంటనే స్పందించి శిశువును రక్షించారు. బిడ్డను మాతా–శిశు కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో తల్లి, మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులు సహా మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది.
