జిందగీ9 న్యూస్, మార్చి 13 (గంగాధర):
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రైతులు సాగు నీటి సమస్యపై పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుండి నారాయణపూర్ చెరువులోకి నీటిని విడుదల చేసి, కాలువల ద్వారా సాగు నీటిని అందించాలని డిమాండ్ చేశారు.
గురువారం గంగాధర మండల కేంద్రం మధురనగర్ చౌరస్తా వద్ద రైతులు జాతీయ రహదారిని మూసివేసి ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నీళ్లు ఇవ్వకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం
రైతులు నీరు వదలకుంటే కరీంనగర్ కలెక్టరేట్, ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వేలాది ఎకరాల పంటలు నష్టపోతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధర్నాకు స్థానికులు భారీ మద్దతు తెలిపారు.
—
“నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా?” – సుంకె రవిశంకర్
హౌస్ అరెస్టులో ఉన్న సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే కాళేశ్వరం జలాలు సకాలంలో విడుదల కావడం లేదు. రైతులను అరిగోస పట్టించే దద్దమ్మ సర్కారు ఇప్పుడు అబద్ధాలతో కాలం గడుపుతోంది” అని మండిపడ్డారు.
“పదేళ్ల పాలనలో నీటి కరువు చూడలేదు. ఇప్పుడు జలాశయాల్లో నీరు ఉన్నా ఇవ్వలేని దుస్థితి వచ్చింది” అని విమర్శించారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.20,000 పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
“రైతులు కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారు. ఆయన హయాంలో వ్యవసాయం స్వర్ణ యుగంగా మారింది” అని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసత్య ప్రచారం చేస్తున్నాడని, రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.
“రైతులకు అండగా నిలిచి, ప్రతి మండలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో హరీష్ రావు, కేటీఆర్ ఈ అంశాన్ని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు” అని స్పష్టం చేశారు.
“ఎద్దు ఏడ్చిన వ్యవసాయం నిలబడదు, రైతు ఏడ్చిన రాజ్యం నిలువదు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమి తరిమి కొడతారు” అని వ్యాఖ్యానించారు.
