జర భద్రం: రేగు పండ్ల కోసం వెళ్లిన చిన్నారి బావిలో పడి మృతి.. గ్రామంలో విషాదం

వీణవంక, ఫిబ్రవరి 12 (Zindagi9News): ఆ పసివాడికి రేగు పండ్లంటే ఇష్టం.. ఆ ఇష్టమే ప్రాణాల మీదకు తెచ్చింది. సరదాగా రేగు పండ్లు కోసుకుందామని వెళ్ళిన ఓ ఆరో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన అత్యంత విషాదకర ఘటన వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.సంఘటన వివరాల్లోకి వెళ్తే.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈర్నాల శారద, శ్రీనివాస్ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన (మంగళవారం) ఉదయం 8 గంటలకు దంపతులిద్దరూ పనికి వెళ్లారు. ఆ సమయంలో వారి కుమారుడు ఈర్నాల రాజు (11) ఇంటి వద్దే ఉన్నాడు. సాయంత్రం 5 గంటలకు తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి బాబు కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆందోళనతో గాలిస్తున్న కుటుంబ సభ్యులకు రాత్రి 12 గంటల సమయంలో సమీపంలోని కొలిపాక శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ బావి వద్ద రాజు చెప్పులు కనిపించాయి. అక్కడ ఉన్న రేగు చెట్టు వద్దే చెప్పులు ఉండటంతో బావిలో పడి ఉండవచ్చని అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం బావిలోని నీటిని ఇంజిన్ల ద్వారా బయటకు తోడగా, రాజు మృతదేహం లభ్యమైంది.
రేగు పండ్ల కోసం చెట్టు వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు రాజు స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తల్లి శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీణవంక ఎస్.ఐ. కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించి దర్యాప్తు ప్రారంభించారు. చేతికంది వస్తాడనుకున్న కుమారుడు కళ్లముందే శవమై పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కలచివేశాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
