జూలూరుపాడు, జూన్ 22 (జిందగీ 9 న్యూస్ రిపోర్టర్):
పెళ్లయి 13 సంవత్సరాలు గడిచినా.. ఆమె భర్త వ్యవహారం మాత్రం మారలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. చివరకు అదే ప్రేమ కళావతికి ప్రాణాంతకమైంది. జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవి అందించిన సమాచారం మేరకు, పాపకొల్లు శివారు వెనకతండాకు చెందిన కళావతి (32), జూలూరుపాడు నివాసి షేక్ అన్వర్ (తండ్రి: యాకూబ్ మియా)ను ప్రేమించి 13 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కానీ మతభేదాల కారణంగా అన్వర్ ఆమెను తరచూ కులం పేరుతో దూషిస్తూ, అనుమానంతో చిత్రహింసలకు గురి చేస్తుండేవాడట. తన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కళావతి భరించేందుకు ప్రయత్నించినా, అన్వర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. జూన్ 19న అక్రమ సంబంధంపై అనుమానంతో పురుగుల మందు తాగి చచ్చిపోమంటూ ఆమెకు బుట్ట పెట్టి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. కొంతసేపటికి అన్వర్ తల్లి తలుపులు తీసినప్పుడు కళావతి అపస్మారక స్థితిలో కనిపించడంతో, వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రి తోడు కాలేదని, పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స అందించినా ఆరోగ్యం కుదుటపడలేదు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలిస్తుండగా తల్లాడ వద్ద సాయంత్రం 3 గంటల సమయంలో ఆమె తుది శ్వాస విడిచింది. తన కుమార్తెను కులం పేరుతో వేధించి, ఆత్మహత్య చేసుకునేలా ఒత్తిడి తెచ్చిన అన్వర్నే ఇందుకు బాధ్యుడిగా పేర్కొంటూ మృతురాలి తండ్రి ధారావతు సామ్య జూలూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
