హనుమకొండ, మార్చి 30 (జిందగీ9 న్యూస్): విశ్వవాసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అమ్మవారి దర్శనం తీసుకుని ఆశీర్వాదాలు పొందారు.
తొలుత ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్షల పూల అర్చనలో భాగంగా ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు అమ్మవారికి పుష్పాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషు భారతి కు ‘ఆగమాడునికి’ బిరుదు లభించిన సందర్భంగా ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా భద్రకాళి చెరువు పూడిక తీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యేలు, ఆలయ పరిసర అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అనంతరం షిరిడీ సాయినాథుడి దర్శనం తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, ఈ ఉగాది ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విశ్వవాసు నామ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు సంతోషంగా ఉండాలని, అన్ని వృత్తులవారు అభివృద్ధి చెందాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల వలన ప్రజల జీవితాల్లో సంతోషం నిండాలని తెలిపారు.
నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోందని, ఈ సంవత్సరం ఉద్యోగ నామ సంవత్సరంగా మారాలని ఎమ్మెల్యే నాగరాజు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ కుందూరు వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ జక్కుల రవీందర్, తదితర కాంగ్రెస్ నాయకులు, యూత్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
