
బాలికల గురుకులంలో వార్డెన్ దాడి.. విద్యార్థిని పై కర్రతో దాడి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకులంలో వార్డెన్ భవానీ విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. విద్యార్థినిని తన గదికి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ప్రతిరోజూ ఏదో ఒక సాకుతో తమను కొడుతూ వేధిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టాయి. బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని, వార్డెన్ భవానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి, బాధ్యురాలైన వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. బాలికల భద్రత, హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
