పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం మద్యాహ్నం దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ను ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ కత్తితో మెడపై పొడిచి హత్య చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదుచేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, అతడితో పాటు ఓ మహిళను కూడా విచారణ నిమిత్తం స్టేషన్కు తరలించారు.
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో జరిగిన హత్యపై డీసీపీ కరుణాకర్ స్పందిస్తూ, “మృతుడు కుమార్కు నిందితుడు సంతోష్ భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కారణంగానే ఈ దారుణానికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నాం. నిందితుడిని విచారిస్తున్నాము. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడి చేయనున్నాం” అని తెలిపారు.
ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది.
