డిఆర్డిఏ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అక్రమాలపై విచారణ జరపాలి..
జిల్లా కలెక్టర్‌కు రాచాల ఫిర్యాదు
వనపర్తి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న భాష్యా నాయక్ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి ఆధారాలతో పాటు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ, వనపర్తి గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న భాష్యా నాయక్ పై మహిళా సంఘాలు, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుండి అనేక ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. ఒక్కో కొనుగోలు కేంద్రం నుంచి రూ.5,000 చొప్పున సంవత్సరానికి రూ.10 లక్షల వరకూ వసూలు చేస్తున్నాడని చెప్పారు.
అలాగే, ఆ మొత్తాన్ని నగదు రూపంలో లేదా ప్రభుత్వం అందించిన ఫోన్ నంబరుతో ఫోన్ పే ద్వారా డిపిఎం భాష్యా నాయక్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళా సంఘాల్లో పనిచేస్తున్న బుక్ కీపర్లు, సీసీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఫోన్ పే నంబరుకు లింక్ అయిన ఖాతాలలోకి వచ్చిన డబ్బులు, వాటి మూలాలు, అలాగే సీసీలు, బుక్ కీపర్ల ద్వారా వసూలైన మొత్తాలపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాచాల జిల్లా కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వజగౌని వెంకటన్న, పట్టణ అధ్యక్షుడు దేవర శివ, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, గడ్డం శేఖర్, రామన్ గౌడ్, రాందాస్ నాయక్, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
