బండరాయిపాకుల కొత్త గ్రామం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొల్ల కురువల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించమని గొర్రెల-మేకల పెంపకదారుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. దేవేందర్ హెచ్చరించారు.
రేవెల్లి మండలం బండరాయిపాకుల కొత్త గ్రామంలో గొర్రెల కాపరుల సహకార సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం గ్రామ నాయకుడు గోపాల వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం గొల్ల కురువల అభివృద్ధికి ఎన్నో వాగ్దానాలు చేసి అమలు చేయకపోవడంతో ప్రజలు తగిన మూల్యం చెల్లించారని విమర్శించారు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
▪ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గొల్ల కురువల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు.
▪ గొర్రెల యూనిట్ల పంపిణీ తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
▪ గొర్రెలకు వచ్చే అనేక రోగాలకు తగిన వైద్యం, మందులు అందించకపోవడం వల్ల జీవాలు మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
▪ సంతల్లో శాస్త్రీయ తూకం విధానం అమలు చేయడం దారుణమని విమర్శించారు.
▪ అడవుల్లో గొర్రెలను మేపేందుకు అనుమతించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వానికి హెచ్చరిక
గొల్ల కురువల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి తప్పదని జి. దేవేందర్ హెచ్చరించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గొల్ల కురువలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గొర్రెల-మేకల పెంపకదారుల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ బి. చంద్రమౌళి, జిల్లా నాయకులు ఎం. శివశంకర్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. శ్రీనివాసులు, డివైఎఫ్ఐ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డి గోపుల మహేష్, బండరాయిపాకుల మాజీ సర్పంచ్ దాసు బాలస్వామి, శ్యామ్ క్యామ్ నారాయణ, గోపాల రాములు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. డోలు కళాకారుల బృందంతో ఊరంతా ప్రదర్శన నిర్వహించామని గొర్రెల పెంపకదారుల సహకార సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల వెంకటయ్య తెలిపారు.
